కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో అనడం కరెక్ట్ అని విమర్శించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా బడ్జెట్‌ను కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించారని మండిపడ్డారు. ఇది బడ్జెట్ నా.. లేదా ఎన్నికల హామీలా అనేది బీజేపీ పెద్దలు చెప్పాలని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం చంద్రబాబు లక్ష కోట్ల రూపాయలు అవసరమని చెప్పారని.. అసలు ఆ లక్ష కోట్లు అనే లెక్కలు ఎలా వేశారో తమకు అర్దం కాలేదన్నారు. విభజన చట్టంలోని అంశాలు అమలుకు రూ.12 నుంచి రూ.15 లక్షల కోట్లు అవసరమని తెలిపారు. చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా ఏడాదికి లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 5 లక్షల కోట్లు చాలని చెప్పారని అన్నారు. అమరావతి రాజధానికి కేవలం రూ.15వేల కోట్లు ఇస్తున్నట్లు ఎలా చెప్పారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. పదేళ్లుగా ఏమీ చేయకపోయినప్పటికీ.. ఇప్పుడయినా పూర్తి చేస్తామని ముందుకు వచ్చారన్నారు. పోలవరం పునరావాస బాధితులకు ఎంత మేర నష్టపరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు. లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం విషయంలో పూర్తి గణాంకాలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఇండస్ట్రీయల్ హబ్ నిర్మాణానికి సహకారం అందిస్తామని చెప్పినా.. డబ్బులు ఎంత ఇస్తారో కేంద్రం చెప్పలేదని అన్నారు.