ఉచిత కరెంటు పథకాన్ని రద్దు చేస్తూ తాజాగా రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి.. బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే భజన్‌లాల్ శర్మను ముఖ్యమంత్రిగా నియమించింది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పథకాలను నిలిపివేస్తూ రాజస్థాన్‌లోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు రాజస్థాన్‌లో అమలు అవుతున్న ఉచిత కరెంటు పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఉన్న లబ్ధిదారులకు కొనసాగిస్తామని సీఎం భజన్ లాల్ శర్మ స్పష్టం చేశారు. కొత్తగా ఈ పథకం కింద దరఖాస్తులను స్వీకరించడం నిలిపివేస్తామని తెలిపారు.
గతంలో రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న అశోక్ గెహ్లాత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఉచిత స్మార్ట్ ఫోన్ పథకాన్ని కూడా తీసుకురాగా.. తాజాగా ఆ రెండు పథకాలను బీజేపీ సర్కార్ రద్దు చేసింది. 2023 జూన్ నుంచి 2024 మార్చి వరకు ఈ ఉచిత విద్యుత్ పథకానికి 98.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. జనధార్‌తో లింక్ అయన డొమెస్టిక్ కనెక్షన్ మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయని రాజస్థాన్ ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు. ఇందులో నమోదు చేసుకోని వినియోగదారులు పథకానికి అనర్హులు అవుతారని వారికి ఉచిత కరెంట్ రాదని స్పష్టం చేశారు. ఇక నుంచి ఎలాంటి కొత్త దరఖాస్తులను స్వీకరించమని తేల్చి చెప్పారు.
ఇక రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2024 జనవరి నాటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా 24. 56 లక్షల మంది మహిళలకు ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు అందినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రావడంతో 2023 అక్టోబర్ 9 వ తేదీన ఫోన్ల పంపిణీని నిలిపివేయగా.. తాజాగా ఆ పథకాన్ని బీజేపీ సర్కార్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ పంపిణీ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 1,811.30 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1,745.22 కోట్లు ఖర్చు చేశారు.