దేశంలో ప్రతీ 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన.. 2021 లో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత కూడా అప్పుడూ ఇప్పుడూ అంటూ కాలయాపన జరుగుతుండగానే.. సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో జనగణన ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయి. అయితే బడ్జెట్‌లో జనాభా లెక్కింపు కోసం తక్కువ కేటాయింపులు చేయడంతో ఈసారి కూడా జనగణన, జాతీయ జనాభా నమోదు ఇప్పట్లో ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
జనాభా లెక్కలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పరిమిత కేటాయింపులు చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో జనగణన, జాతీయ జనాభా నమోదు ప్రక్రియ కోసం కేంద్రం కేవలం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. అయితే 3 ఏళ్ల క్రితం నాటి కేటాయింపులతో పోలిస్తే ఈసారి తక్కువగా కేటాయించడం గమనార్హం. 2021-2022లో జన గణనకు రూ.3,768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ.. కరోనా కారణంగా ఆ దిశగా అడుగులు పడలేదు. 2023-24 బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం కేవలం రూ.578.29 కోట్లు మాత్రమే కేటాయించారు. తాజా బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని మరికొంత పెంచినప్పటికీ.. జనగణన అంచనా వ్యయం కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.
దేశంలో జనగణన, ఎన్‌పీఆర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు రూ.12 వేల కోట్ల కంటే ఎక్కువే ఖర్చు అవుతోందని దాదాపు 5 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2021లో జనగణన చేపట్టేందుకు రూ.8,754 కోట్లు.. జాతీయ జనాభా నమోదును ఆధునీకరించాలంటే రూ.3,941 కోట్లు అవసరం అవుతాయని 2019 డిసెంబరులో అప్పటి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ ప్రణాళిక ఆగిపోయింది. అప్పటినుంచి కేంద్ర ప్రభుత్వం తరచూ వాయిదా వేస్తూనే ఉంది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో జనగణన ఉంటుందని గతంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం గమనార్హం. ఇప్పుడు బడ్జెట్‌లో కూడా తక్కువ కేటాయింపులే చేయడంతో జనాభా లెక్కలు ఈ ఏడాదీ జరిగే అవకాశాలు కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతీ 10 ఏళ్లకు నిర్వహిస్తూనే ఉండగా.. ఈసారి ఆలస్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.