ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితీష్, నిర్మలపై పేలుతున్న జోక్స్, మీమ్స్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 10:28 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 లో ఎన్డీఏ కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అధికారంలో ఉన్న బీహార్‌కు.. బడ్జెట్‌లో ఏకంగా రూ.26 వేల కోట్లు ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. బీహార్‌కు కొత్త ఎయిర్‌పోర్టులు, మెడికల్ కాలేజీలు, హైవేల నిర్మాణానికి ఈ రూ.26 వేల కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్, కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ వర్షం కురుస్తోంది.


బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి నిధుల వరద పారగానే సోషల్ మీడియాలో కూడా బీహార్‌పై మీమ్స్, జోక్స్ వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్యులేషన్స్ కన్నడిగాస్, బెంగాలీస్, తమిళీస్, మరాఠీస్, మలయాళీస్, పంజాబీస్ అంటూ ఓ నెటిజన్ భారీ పోస్ట్ పెట్టాడు. మీరు కట్టే పన్నులు మీకు గానీ, మీ పిల్లలకు గానీ, మీ రాష్ట్రానికి గానీ ఉపయోగపడవు. ఎందుకంటే మీరు కట్టిన పన్నుల డబ్బులు మొత్తం బీహార్‌కు బీజేపీ ధారాదత్తం చేసిందని.. మరిన్ని పన్నులు కట్టండి అని ట్వీట్ చేశాడు.


ఈ బడ్జెట్ బీహార్ పొలిటీషియన్‌కు స్పెషల్ బడ్జెట్ అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే రకరకాల ఫోటోలతో ఫన్నీ మీమ్స్ చేసి ట్వీట్ చేశాడు. అందులో నితీష్ కుమార్, నిర్మలా సీతారామన్‌ల ఫోటోలు కూడా ఉంచాడు. మేము కష్టపడి సంపాదించి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని ఇంకో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇక ఆ సొమ్ముతో ఓ అవినీతి అధికారి అయిన ఇంజినీర్ బీహార్‌లో మరో బ్రిడ్జి కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ట్వీట్ చేశాడు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో బెస్ట్ కెరీర్ ఏంటంటే ట్రేడర్ కావడం కంటే బీహార్‌లో రోడ్డు లేదా బ్రిడ్జి కాంట్రాక్టర్ కావడం బెటర్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.


బీహార్ రాష్ట్రానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయం పట్ల.. పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రజల ముఖచిత్రానికి సంబంధించి ఓ వీడియోను మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. బీహార్‌కు బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు ప్రకటించడంతో ఇప్పుడు అసలైన దోపిడీ జరుగుతుంది అంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు. బీహార్‌లోని రోడ్డు, బ్రిడ్జి కాంట్రాక్టర్లు.. సీఎం నితీష్ కుమార్‌కు ధన్యవాదాలు చెబుతూ హగ్ చేసుకుంటున్నట్లుగా ఓ వీడియోను మార్ఫింగ్ చేసి పెట్టాడు. ఒక బీహార్ వాసిగా కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రకటించిన ప్రాజెక్ట్‌లతో పాటు.. బీహార్‌లోని ప్రాజెక్ట్‌ల నాణ్యతను పర్యవేక్షించే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు.


బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన మరుసటి రోజే.. బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. ఆ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనున్నట్లు ప్రకటించింది. పాట్నా-పుర్నియా ఎక్స్‌ప్రెస్ వే, బక్సార్-భాగల్పూర్ హైవే, బోధ్ గయా-రాజ్‌గిర్-వైశాలి-దర్భంగా మార్గంలో బక్సార్‌లో గంగా నదిపై కొత్తగా 2 లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి రూ.26 వేల కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com