ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్ పరీక్షపై సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 10:27 PM

నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా నీట్‌ క్వశ్చన్ పేపర్ లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ అవసరం లేదని స్పష్టం చేసింది.


జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని వచ్చిన ఆరోపణలు నిజమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌.. బీహార్‌ రాజధాని పాట్నాలోని పలు పరీక్ష కేంద్రాల్లో నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలు, ఆధారాల ప్రకారం.. పేపర్ లీకేజీ కారణంగా దాదాపు 155 మంది విద్యార్థులు లబ్ధిపొందినట్లు తెలుస్తోందని చెప్పారు. దీంతో ఆ 155 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


 ఇక ఈ పేపర్ లీకేజీ కారణంగా నీట్ యూజీ పరీక్ష మొత్తం అక్రమమని చెప్పలేమని.. అందుకు సరైన ఆధారాలు లేవని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ప్రస్తుత దశలో వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. వారిలో అనేకమంది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు.


మే 5 వ తేదీన దేశవ్యాప్తంగా 4750 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్షలో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. అయితే నీట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్ధులకు 720 కి 720 మార్కులు రావడం పెను దుమారం రేగింది. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో చెందిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు మొదలయ్యాయి. అంతమందికి టాప్‌ ర్యాంకు రావడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్‌ వాలా అనే విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండేతో పాటు మరికొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది.


దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే 5 వ తేదీన నీట్ యూజీ ఎంట్రన్స్ టెస్ట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ - ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీక్ అయిందని.. కొన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఫుల్ మార్క్స్ రావడంతోపాటు చాలా మందికి టాప్ ర్యాంకులు రావడం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. నీట్ పేపర్ లీక్ అయిందంటూ కొందరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపు దాల్చడంతో సీబీఐ ఎంటర్ అయి దర్యాప్తు చేసి సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చింది. మరోవైపు.. నీట్ పేపర్ లీకేజీ జరిగినందున దాన్ని పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com