తిరుమలలో ఈ నెల 13వ తేదీకి సంబంధించిన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీని తితిదే అధికారులు శనివారం రాత్రి నుంచే ప్రారంభించారు. ముక్కోటి ఏకాదశితో పాటు తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి బుధవారం రాత్రి టోకెన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. 13వ తేదీ (సోమవారం) నుంచి ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేస్తామని తితిదే అధికారులు తొలుత ప్రకటించారు. అయితే శనివారం రాత్రికే తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తోపులాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జారీ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలోని మూడు కేంద్రాల వద్ద సోమవారం నుంచి ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేస్తామని తితిదే అధికారులు ముందుగా చెప్పారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం శనివారం రాత్రికే భక్తులు తిరుపతి చేరుకున్నారు. వీరంతా మూడు కేంద్రాల్లోని క్యూలైన్లలోకి వస్తూ ఉన్నారు. అధికారులు చెప్పినా తాము వేచి ఉంటామని పేర్కొంటూ అక్కడే కూర్చున్నారు. దీంతో మళ్లీ ఎక్కువ మంది భక్తులు కేంద్రాల వద్ద గుమిగూడితే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. దీంతో 13వ తేదీ తెల్లవారుజాము 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గల వివిధ స్లాట్ల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభించారు. సుమారు 49 వేల టోకెన్లు ఇవ్వనున్నారు. వచ్చిన భక్తులకు వచ్చినట్లు టోకెన్లు జారీ చేయడం వల్ల కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేయవచ్చని తితిదే అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రాల వద్ద భక్తులు తగ్గాక క్యూలైన్లలో కాకుండా నేరుగా కౌంటర్ల వద్దకు పంపించి వారికి టోకెన్లు ఇస్తున్నారు