ముంబయి బ్యాట్స్ ఉమన్ ఇరా జాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత అండర్-19 మహిళల వన్డే టోర్నీలో 14 ఏళ్ల ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీ సాధించింది. బెంగళూరులో ముంబయి-మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరా జాదవ్ సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదుచేసింది. మేఘాలయ బౌలర్లను ఊచకోత కోసిన ఈ ముంబయి టీనేజి సెన్సేషన్ 157 బంతుల్లో ఏకంగా 346 పరుగులు చేసింది. ఇరా స్కోరులో 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయంటే, ఆమె విధ్వంసం ఏ రీతిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాటర్ గా ఇరా జాదవ్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇరా జాదవ్ ఇటీవల నిర్వహించిన మహిళల ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో అన్ సోల్డ్ గా మిగిలిపోయింది