ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం హెల్త్ వర్సిటీ పేరును మార్చింది. వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎన్టీఅర్ హెల్త్ వర్సిటీగా పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు.. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరోవైపు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం శాసనసభలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ కారణాలతోనే అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చిందని విమర్శించారు. హెల్త్ వర్సిటీ పేరు మార్పు కారణంగా అనేక వర్సిటీలో అడ్మిషన్లకు ఇబ్బందులు ఎదురయ్యాయని.. విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులు ఇబ్బందిపడ్డారని చెప్పారు.
ఎన్టీఆర్ లాంటి మహనీయుడి పేరును మార్చాలని వైసీపీ ప్రభుత్వానికి ఎలా అనిపించిందో అంటూ ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన సమయంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులుగా చెప్పుకునేవారు కొంతమంది కనీసం నిరసన కూడా తెలపలేదంటూ సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ వారు వైసీపీలోనే ఉన్నారంటూ లక్ష్మీపార్వతిని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మరోవైపు దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నందమూరి లక్ష్మీపార్వతి ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. 2024 ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ కూటమి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలోనే ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్ పదవి నుంచి నందమూరి లక్ష్మీపార్వతి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.