నేపాల్ రాజధాని ఖాట్మాండు లో విమాన ప్రమాదం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఖాట్మాండ్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి పైలట్ చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డారు. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాట్మాండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్ సీఆర్‌జే 200 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. రన్‌వేపై నుంచి జారిపడిన వెంటనే మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. ప్రమాద సమయంలో విమానంలో నలుగురు సిబ్బంది సహా 19 మంది ఉన్నారు.
18 మంది మృతి చెందగా.. పైలట్ గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గాయపడిన పైలట్‌ను విమాన శకలాల నుంచి బయటకు తీసి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం రన్‌వేపై విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రన్‌వేపై నుంచి ఎగిరిన విమానం కొన్ని వందల అడుగులు చేరుకోగా.. సెకెన్ల వ్యవధిలోనే హఠాత్తుగా కూలిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అనేది తెలియరాలేదు.
నేపాల్‌లో విమాన ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పైలట్‌లకు సరైన శిక్షణ లేకపోవడం, నిర్వహణలోపం వంటివి ప్రమాదానికి కారణాలు. నేపాల్ విమానాలు తరుచూ ప్రమాదాలకు గురికావడంతో యూరోపియన్ యూనియన్ తమ గగనతలంలోకి వాటిని రానీయకుండా నిషేధించింది. ఇక, పర్వతాలపై సముద్ర మట్టానికి ఎత్తులో నిర్మించిన టేబుల్ టాప్ రన్‌వేల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ రన్‌వేలపై విమానం ల్యాండింగ్, టేకాఫ్ కత్తిమీద సాములాంటింది. నైపుణ్యం, అనుభవం ఉన్న పైలట్‌లే వీటిపై విమానం సురక్షితంగా దింపగలరు. గతేడాది జనవరిలో పొఖారా వద్ద జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు దశాబ్దాల తర్వాత నేపాల్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇదే. 1992 నాటి పాకిస్థాన్ ఎయిర్‌లైన్ విమాన ప్రమాదం నేపాల్ చరిత్రలో ఘోరమైందిగా నిలిచిపోయింది. కాట్మాండులో పాక్ విమానం కూలి 167 ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది 113 మందితో వెళ్తోన్న థాయ్‌లాండ్ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది.
తాజాగా జరిగిన విమాన ప్రమాదం ఎలా జరిగిందో? తెలియాల్సి ఉంది. దీనిపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సాంకేతికలోపం కారణంగానే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇందులో కుట్ర కోణం ఏదైనా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన పైలట్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
నేపాల్‌లో విమానం కూలిన ఘటన తీవ్ర విషాదం నింపింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం కుప్పకూలుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం గురించి భారత్‌లోనూ సెర్చ్ చేస్తున్నారు. ‘నేపాల్ ప్లేన్ క్రాష్’ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. సిక్కిం, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఢిల్లీలో ఈ ఘటన గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఈ ప్రాంతాల్లో నేపాల్‌కు చెందినవారు, వారి బంధువులు ఎక్కువగా నివసిస్తున్నారు.