దేశానికి రాష్ట్రపతి...కానీ అనూహ్యంగా టీచర్ అయ్యారు. ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. స్కూలుకు వెళ్లడమే కాకుండా అక్కడ ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. 9 వ తరగతి విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్రపతి.. వారికి పాఠాలు బోధించారు. అయితే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ్టితో (జులై 25) 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమెకు ఎంతో ఇష్టం ఉన్న వృత్తి అయిన ఉపాధ్యాయురాలిగా ద్రౌపదీ ముర్మూ మారారు. ముందుగా విద్యార్థుల పేర్లు అడిగి వారి ఇష్టాలు, అభిరుచులు, భవిష్యత్‌లో ఏం కావాలి అనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రపతిగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్‌లో ఉన్న డా.రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వెళ్లి పాఠాలు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్‌పై విద్యార్థులకు పాఠాలు బోధించారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.
పంతులమ్మగా మారిన రాష్ట్రపతి.. విద్యార్థులకు పాఠాలు
అదే సమయంలో నీటి సంరక్షణ ఎంత ముఖ్యమో వివరించారు. పర్యావరణ మార్పు ప్రభావం.. ప్రజలపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి)’ ను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ స్కూల్‌లోని స్టూడెంట్స్ పేర్లు అడిగి, వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. ప్రస్తుత జనరేషన్‌లోని విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులు అని టెక్నికల్ పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్మూ వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ద్రౌపదీ ముర్మూను కేంద్ర ప్రభుత్వం 15 వ రాష్ట్రపతిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే 2022 జులై 25 వ తేదీన ద్రౌపదీ ముర్మూ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే దేశ మొదటి పౌరురాలి స్థానానికి ఎంపికైన తొలి ఆదివాసీ వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు.
అంతేకాకుండా.. రాష్ట్రపతి పదవి చేపట్టిన అతి చిన్న వయస్సు కలిగిన వారు కూడా ఆమెనే కావడం గమనార్హం. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 1994-97 మధ్య రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రెల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో టీచర్‌గా పనిచేశారు.