అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న ఓ బైకర్.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆమెనే రష్యాకు చెందిన ఓ మోస్ట్ బ్యూటిఫుల్ యూట్యూబర్ తత్యానా ఓజోలినా.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రష్యాకు చెందిన తత్యానా ఓజోలినాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో బైక్ రైడింగ్‌పై వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ స్పోర్ట్స్ బైకులపై ఆమె చేసే రైడింగ్ వీడియోలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా ఆమెను ముద్దుగా మోటో తాన్యా అని పిలుస్తుంటారు. తత్యానా ఓజోలినాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లు.. ఆమె యూట్యూబ్ ఛానల్‌కి 20 లక్షల మంది ఫాలోవర్లు, టిక్‌టాక్ అకౌంట్‌కి 50 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
చూడటానికి పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తున్నా... తత్యానా ఓజోలినా వయసు 38 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన రైడింగ్లు చేసే ఓజోలినాను రష్యా మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్‌గా అభిమానులు అభివర్ణిస్తుంటారు. అయితే ఆమెకు 13 ఏళ్ల కుమారుడు కూడా ఉండడం గమనార్హం. తత్యానా ఓజోలినా మృతిని తట్టుకోలేని ఫాలోవర్స్ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.
ఏ బైక్ రైడింగ్‌తో అయితే ఫేమస్ అయిందో అదే రైడింగ్‌లో ఓజోలినా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపుతోంది. తన ఎరుపురంగు బీఎండబ్ల్యూ బైక్‌పై ట్రావెలింగ్కు వెళ్లిన ఆమె తుర్కియేలోని మిలాస్ ప్రాంతంలో కంట్రోల్ కోల్పోయి ట్రక్కును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓజోలినా అక్కడిక్కడే మృతిచెందగా.. వెనుక కూర్చున్న మరొక బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఓజోలినా బైక్ నడుపుతుండగా.. మరో రైడింగ్ గ్రూప్ అడ్డుగా వచ్చిందని దీంతో ఆమె సడెన్‌గా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా చెబుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓజోలినా మరణంపై ఆమె ఫాలోవర్స్, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.