అమెరికాలో రాజకీయ పరిణమాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను జో బైడెన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు.. ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు తెలుపుతున్నారు. కానీ, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఇంతవరకూ కమలాకు మద్దతుగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, డొనాల్డ్ ట్రంప్‌ను ఆమె ఓడించలేదని భావించిన ఒబామా.. కమలా హ్యారిస్ అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలపడం లేదని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. ‘ఒబామా తీవ్ర నిరాశకు గురయ్యారు.. ఎందుకంటే ఆమె గెలవలేదని ఆయనకు తెలుసు’ అని బైడెన్ కుటుంబ వర్గాలను ఉటంకించింది.
‘ఒబామాకు ఆమె అసమర్థురాలని తెలుసు.. వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని చెప్పిన ఆమె.. సరిహద్దులను ఎప్పుడూ సందర్శించలేదు... ఆమె తన ముందున్న సవాళ్లకు ఎదురు నిలవలేరు.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు మీరు చెప్పగలిగేవి, చెప్పలేనివి ఉన్నాయి.’ అని ఆ వర్గాలు చెప్పినట్టు కథనం పేర్కొంది. బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆరిజోనా సెనేటర్ మార్క్ కెల్లేను అభ్యర్ధిగా ఉండాలని ఒబామా కోరుకుంటున్నట్టు హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ రాసిన ఈ కథనంలో తెలిపారు. తన ప్లాన్‌లో భాగంగానే బైడెన్‌ను ఆయన తప్పుకోమన్నారని వివరించారు.
వచ్చే నెలలో జరిగే డెమొక్రాటిక్ పార్టీ జాతీయ సదస్సులో మార్క్ కెల్లేకు మద్దతు ఇవ్వాలని ఒబామా భావిస్తున్నట్టు కథనం వెల్లడించింది. ఒబామా కోపంగా ఉన్నారని, ఆయన అనుకున్నట్టు జరగకపోవడంతోనే హ్యారిస్‌కు మద్దతు ఇవ్వడంలేదని తెలిపింది. ఇదిలా ఉండగా.. కమలా హ్యారిస్ అభ్యర్ధిత్వాన్ని ఒబామా త్వరలోనే ఆమోదిస్తారని ఎన్బీసీ న్యూస్ నివేదించడం గమనార్హం. ఆయన వ్యక్తిగతంగా కమలా అభ్యర్ధిత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నారని, తరుచూ ఆమెతో మాట్లాడుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని పేర్కొంది. ‘ఇరువురూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఒబమా, హ్యారిస్ సన్నిహితులు చర్చిస్తున్నారు’ అని నివేదించింది.
మరోవైపు, బైడెన్ తప్పుకోడానికి ముందు డెమొక్రాటిక్ అభ్యర్ధిగా బరాక్ ఒబామా భార్య మిషెల్లీ ఒబామా పోటీచేస్తారని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ గత నెలలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్ తేలిపోవడంతో మిషెల్లీ పేరు తెరపైకి వచ్చింది. ‘డెమొక్రాటిక్ పార్టీలోని 80 శాతం మంది జో బైడెన్‌ను తొలగించి.. మిషెల్లీ అభ్యర్ధిగా ఖరారు చేయాలని భావిస్తున్నారు.. ఎందుకంటే తొలి డిబేట్‌లో ఆయన తాడబాటుతో దేశవ్యాప్తంగా డెమొక్రాట్లు ఆందోళనకు గురవుతున్నారు’ అని క్రూట్ అప్పట్లో అన్నారు. ఇప్పటి వరకూ మిషెల్లీ మాత్రం ఎన్నికల్లో పోటీపై ఎటువంటి ఆసక్తి చూపడం లేదు.