ఏపీలో దళితుల కోసం గతంలో టీడీపీ అమలు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి తెస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు అయితే టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేసి వైఎస్ జగన్ వారికి అన్యాయం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని., ఎస్సీ ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానం అమలు చేయలేదన్నారు.
అలాగే మెడికల్ సీట్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదని.. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని అమలు చేయలేదని మంత్రి బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఎస్సీలకు ఇస్తున్న 50 వేల రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన సంగతి గుర్తుచేశారు. 2014 - 2019 మధ్యకాలంలో ఐఎస్బి సెక్టార్, పశుసంవర్ధక శాఖ కింద బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా 60 శాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలు అందించామని మంత్రి చెప్పారు. అలాగే భూమి కొనుగోలు పథకం ద్వారా భూమి లేని పేదలు 2,518 మందికి 2360.77 ఎకరాల భూపంపిణీ చేశామన్నారు. ఎన్ఎస్ఎఫ్‌డీసీ కింద రూ. 552.55 కోట్లతో 10,634 మంది ఎస్సీ యువతకు ఇన్నోవా కార్లు ఇతర యూనిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు.
అలాగే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందించామన్న మంత్రి బాల వీరాంజనేయస్వామి.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా 23,389 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించమన్నారు. రూ.32.23 కోట్లతో 437 మంది విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించినట్లు చెప్పుకొచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత వైఎస్ జగన్ ఈ దళిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని మంత్రి ఆరోపించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం త్వరలోనే వైసీపీ రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తుందని స్పష్టం చేశారు.