ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం విజయవాడకు బయలుదేరి వస్తారు. మధ్యాహ్నం 1-50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం బిజీ బిజీగా గడిపారు. నీతి అయోగ్ భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవే వచ్చాయని ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్లు కొందరు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి విషయంలో కేంద్రం సాయం చేస్తున్నందున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో పొలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీయేకు అప్పగించారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.