శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న డిపార్టుమెంట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. ఈ మేరకు శనివారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల(చిలకపాలెం), శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల(ఎచ్చెర్ల), కోర్ టెక్నాలజీస్ (నరసన్నపేట) కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు కేంద్రాల్లో 1,715 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఉంటుందన్నారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిస్కిప్టివ్ తరహా పరీక్ష ఉంటుందన్నారు. సంబంధిత అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని, ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు గుర్తింపు కార్డులు, సర్వీసు రూల్స్ పుస్తకాలు మాత్రమే తీసుకురావాలని, సెల్‌ఫోన్లు, తదితర ఎలకా్ట్రనిక్ వస్తువులు తీసుకురావద్దని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్.కుమార్‌రాజా, అసిస్టెంట్ సెక్షన్ అధికారి ఎం.శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.