ప్రతీ విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్కనాటి పర్యావరణాన్ని కాపాడాలని బాడంగి డీఈవో ప్రేమ్‌కుమార్ సూచించారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించిన ఆయన విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. మరోవైపు జాతీయ నూతన విద్యావిధానం 2020లో ప్రవేశపెట్టి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం పిలుపునిచ్చిన శిక్షా సప్తాహ్ కార్యక్రమం అమలును పర్యవేక్షించారు. ఇందులో భాగంగానే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎకోక్లబ్‌డే, న్యూట్రిషన్‌డే, పోషకాహారం ఆవశ్యకత, కిచెన్ గార్డెన్, ఆర్గానిక్ ఫార్మింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు విద్యార్థులతో చేయించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం దత్తి సత్యనారాయణ, ఎంఈవోలు లక్ష్మణదొర, రాజేశ్వరి, ఎంపీటీసీ దేవరాపల్లి శ్రీను, సర్పంచ్ కండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.