మద్యం సేవించి వాహనం నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడినా కఠిన చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మాసాంతర నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హిస్టరీ షీట్ కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, వారి ప్రవర్తనను గమనిస్తుండాలన్నారు. తరచూ నేరాల్లో వున్నవారిని, దురుసు ప్రవర్తన కలిగే వారిని బైండోవర్ చేయాలని సూచించారు. నేరాల నియంత్రణకు పగలు, రాత్రుల బీట్‌లతో గస్తీలు ముమ్మరం చేయాలని, రద్దీ ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకుల వద్ద సాయంత్ర సమయాల్లోనూ విజిబుల్ పోలిసింగు నిర్వహించి ఆకతాయిలను కట్డడి చేయాలన్నారు. గంజాయి నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా తీవ్రంగా పరిగణించి కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని, హెచ్చరిక బోర్డులు, స్టాపర్లు, జిగ్‌జాగ్ రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్‌పీలు ఆష్మాపరహీన్, ఎంఎం సోల్‌మాన్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.