టీడీపీ ఎమ్మెల్యే పులివర్త నానిపై ఎన్నికల సమయంలో దాడి కేసులో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ వెళ్లబోతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తిరుపతి తీసుకొచ్చిన తర్వాత ఆదివారం ఉదయం వదిలిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరిగిన మర్నాడు పులివర్తి నానిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు, వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి మోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు.
నాిపై హత్యాయత్నం కేసులోనే మోహిత్ రెడ్డిని తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం మోహిత్‌రెడ్డిని ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే, విదేశాలకు వెళ్లకూడదని షరతు విధించిన పోలీసులు.. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక, మోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా తమపై కేసులు పెట్టారని.. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామని చెప్పారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. విదేశాల్లో చదివిన వాడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నా కొడుకు వయస్సు 25 ఏళ్లని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని చెప్పారు. అక్రమ కేసులో అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు తాను కృతజ్ఞతలు చెబుతున్నానని, నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడిని అని అన్నారు.
తన కంటే మిన్నగా తన కుమారుడు ప్రజల పక్షాన నిలబడి చేసే పోరాటాలు ఎలా ఉంటాయో ఈప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తాడని సవాల్ చేశారు.ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇక, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో పులివర్తి నాని త్రుటిలో గాయాలతో బయటపడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు.