బెంగళూరులో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ముక్కు నుంచి ధారగా రక్తం వచ్చింది. ఈ విషయాన్ని విలేకర్లు, సిబ్బంది.. కుమారస్వామికి తెలియజేశారు. దీంతో వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను, అవినీతిని ఎండగడుతూ బీజేపీ- జేడీఎస్ కలిసి పాదయాత్రను ప్లాన్ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఆదివారం బెంగళూరులోని ఓ హోటల్‌లో బీజేపీ- జేడీఎస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను వెల్లడించేందుకు హోటల్ వద్ద కుమారస్వామి మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.
విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలోనే కుమారస్వామి ముక్కు నుంచి అకస్మాత్తుగా రక్తం వచ్చింది.. చొక్కా మీద కూడా రక్తపు మరకలు అయ్యాయి. వెంటనే పక్కనున్న సిబ్బంది, నేతలు ఆయనను అప్రమత్తం చేశారు. దీంతో కర్చీఫ్ అడ్డుగా పెట్టుకుని ఆయన పక్కకు వెళ్లారు. ఆ వెంటనే సిబ్బంది.. కుమారస్వామిని అపోలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ దృశ్యాలు మీడియాలో వైరల్ కావటంతో జేడీఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురౌతున్నారు. తమ నేత ఆరోగ్యానికి ఏమైందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ- జేడీఎస్ సమావేశానికి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ సైతం హాజరయ్యారు. ఘటన జరిగిన సమయంలో నిఖిల్.. అక్కడే ఉన్నారు. దీంతో వెంటనే సమీపంలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కుమారస్వామి ఆరోగ్యంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కుమారస్వామి ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు నిఖిల్ గౌడ కీలక వివరాలు వెల్లడించారు.
కుమారస్వామి ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని నిఖిల్ గౌడ విజ్ఞప్తి చేశారు, తన తండ్రి కుమారస్వామి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నట్లు నిఖిల్ గౌడ తెలిపారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి కొనసాగుతున్నారు. అయితే కేంద్ర మంత్రిగా బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన విశ్రాంతి తీసుకోలేకపోయారని..ఈ ఘటనకు అదే కారణమని నిఖిల్ గౌడ చెప్పినట్లుగా పీటీఐ తన కథనంలో పేర్కొంది.