అది గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి ఆనుకొని ఉండే సర్ఖేజ్ ప్రాంతం. ఆ ఏరియాకు చెందిన 34 ఏళ్ల ఓ యువకుడికి 2023 మే నెలలో ఓ పెళ్లి సంబంధం వచ్చింది. మే నెలలో పెళ్లి చూపులు జరిగాయి. అమ్మాయి తన కంటే ఏడాదిన్నర చిన్నది కావడంతో.. ఆ అబ్బాయి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఓ నెల రోజుల వ్యవధిలో వారిద్దరికీ పెళ్లయ్యింది.
అసలే ఇద్దరికీ 30 ఏళ్లు దాటాయి కదా. ఇంట్లో సంతానం కోసం పోరు మొదలైంది. దీంతో ఆ అమ్మాయి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. తన అక్కను తీసుకొని ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి కలిసింది. ఆ రిపోర్టులను మాత్రం భర్తకు ఇవ్వలేదు. 2023 సెప్టెంబర్లో అతడు తన భార్యను తీసుకొని ఓ గైనకాలజిస్టును కలిశాడు. తాము పిల్లల కోసం ప్రయత్నిస్తున్నామని డాక్టర్‌తో చెప్పాడు. దీంతో ఆమెను పరీక్షించిన డాక్టర్.. అతడికి దిమ్మతిరిగే వార్త చెప్పింది.
‘నీ భార్య వయసు 32 ఏళ్లని చెప్పావ్ కదా బాబు.. కానీ సోనోగ్రఫీ రిపోర్ట్ ప్రకారం ఆమె వయసు 40-42 ఏళ్లు. ఆమెకు సహజ పద్ధతిలో పిల్లలు పుట్టడం సాధ్యపడదు’ అని డాక్టర్ చెప్పింది. ఎందుకైనా మంచిదనుకొని మరో డాక్టర్‌ను కలిశాడు. అక్కడా అదే సీన్ రిపీటైంది. దీంతో మనోడికి మబ్బులు విడిపోయాయి.. గత నాలుగైదు నెలలుగా జరిగిన ఘటనలు ఒక్కొక్కటి గుర్తుకు రావడం మొదలయ్యాయి.
మొదట్లో మ్యారేజ్ రిజిస్టర్ చేయించడం కోసం ఆధార్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా తన అత్తింటి తరఫు వారు ఇవ్వకపోవడం, ఊళ్లో పెళ్లి చేయాలని కోరడం.. తీరా పెళ్లి రోజే స్కూల్ సర్టిఫికెట్, పాస్‌పోర్టును తనకు ఇవ్వడం గుర్తొచ్చింది. అప్పుడు ఇచ్చిన వివరాల ప్రకారం తన భార్య డేట్ ఆఫ్ బర్త్ 1991 మే 18.
ఇద్దరు డాక్టర్లు తన భార్య వయసు విషయంలో ఒకేలా చెప్పిన తర్వాత.. తను మోసపోయానని.. అత్తింటి వారు తనతో అబద్ధం చెప్పారని అతడు గుర్తించాడు. దీంతో బామ్మర్దికి ఫోన్ చేసి.. నీ చెల్లెలి వయసెంత..? అని అడిగాడు. మొదట్లో అతడు కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ‘అరే బామ్మర్ది బుకాయించకు. డాక్టర్ రిపోర్ట్ నా దగ్గరుంది. నిజం చెప్పకపోతే చీరి చింతకు కడతర బై’.. అనే సరికి బామ్మర్ది అసలు నిజం చెప్పాడు. ‘నిజమే బావ.. మా చెల్లి వయసులో పెద్దది. నీకు ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినవి. తప్పపోయింది క్షమించు బావా’ అని రిక్వెస్ట్ చేశాడు.
సర్లే కానీ.. నీ చెల్లెలి అసలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమని బామ్మర్దిని అడిగాడు. ‘మే 18 కరెక్టే బావా.. కానీ ఇయర్ మాత్రం 1991 కాదు 1985’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. బామ్మర్ది చెప్పిన మాట విన్నాక మనోడిలో ఆగ్రహం, మోసపోయాననే బాధ ఎక్కువయ్యాయి. అత్తింటి వారితో, బామ్మర్దితో మాట్లాడింది మొత్తం రికార్డ్ చేశాడు.
ఆ తర్వాత అత్తింటి వారు తనను మోసం చేశారంటూ.. పలనూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన భార్య, మామ, బామ్మర్దులు సహా మొత్తం 8 మందిపై చీటింగ్ కేసు పెట్టాడు. తన భార్య తరచుగా పుట్టింటికి వెళ్లేదని.. తను, తన కుటుంబ సభ్యులు ఇచ్చిన విలువైన వస్తువులను ఆమె తన పుట్టింటికి తీసుకెళ్లేదని కూడా అతడు ఆరోపించాడు.