పెన్సిల్వేనియాలో తనపై హత్యాయత్నం తర్వాత వెల్లువెత్తిన సానుభూతిని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఓట్లుగా మలిచేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఫ్లోరిడాలో టర్నింగ్ పాయింగ్ యాక్షన్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. వచ్చే నవంబరులో జరిగే ఎన్నికల్లో ఓటేయకుంటే మరో నాలుగేళ్ల పాటు మీకు అవకాశం రాదని క్రైస్తవులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.
‘క్రైస్తవులారా మీరు బయటకు వచ్చి ఓటు వేయాలి.. ఇంతకంటే మీరు చేయవలసిన అవసరం లేదు.. ఈసారి మీ తీర్పు నాలుగేళ్లు పాలనను నిర్దారిస్తుంది... నా ప్రియమైన క్రైస్తవ సోదరులరా.. ఇప్పుడు ఓటేయకుంటే ఇకపై వేయవలసిన అవసరం లేదు.. ఓ క్రిస్టియన్‌గా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీరు బయటకు వచ్చి ఓటు వేయాలి.. అధికారంలోకి వచ్చాక రాబోయే నాలుగేళ్లూ సుపరిపాలన అందిస్తాం.. ’ అని ట్రంప్ అన్నారు. 2020 క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్.. ఈ వ్యాఖ్యల ద్వారా ఏమి సందేశం ఇవ్వాలసుకున్నారో స్పష్టంగా తెలియరాలేదు.
అయితే, కమలా హ్యారిస్ ప్రచార బృందం పరోక్షంగా ఈ వ్యాఖ్యలను ప్రస్తావించింది. వారి ప్రతినిధి జాసన్ సింగర్ మాట్లాడుతూ.. ట్రంప్ మొత్తం ప్రసంగం విచిత్రంగా ఉందని, ఇది ఆయన పోటీలో వెనుకబడ్డారనడానికి నిదర్శనమని అభివర్ణించారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే దక్షిణాన మెక్సికో సరిహద్దులను మూసివేసి.. ఓ నియంతలా వ్యవహరిస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర కలకలం రేగింది. అయితే, అంతలోనే తాను జోక్ చేశానని చెప్పడం గమనార్హం.
మరోవైపు, డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న కమలా హారిస్‌కు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. పార్టీలో ఆమెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండగా.. ట్రంప్‌తో పోటీ విషయంలోనూ కమలా దూసుకెళ్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి, డెమొక్రటిక్ పార్టీకి మధ్య ఓట్ల తేడా 6శాతం ఉండగా.. ఇప్పుడది 1శాతానికి తగ్గిపోవడం విశేషం. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బైడెన్ వైదొలగాక నిర్వహించిన ఈ సర్వే ఫలితతాలు శనివారం విడుదలయ్యాయి. అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్‌నకు.. హ్యారిస్‌కు 47శాతం మంది మద్దతు ఇవ్వడం గమనార్హం. అంటే ఇద్దరి మధ్య కేవలం 1 శాతం తేడాయే ఉంది. దీంతో ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.