ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ చేయూత ఎంతో అవసరమని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై సోమవారం నాడు చర్చలు జరిపారు. కేంద్ర బడ్జెట్‌పై లావు శ్రీకృష్ణదేవరాయలు పలు కీలక విషయాలను పంచుకున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన శూన్యమని చెప్పారు. అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీశారని శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. 2014 -19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జలవనరులు, రహదారుల కల్పనకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా ఏం కేటాయించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విభజన చట్టాన్ని తయారు చేసిందన్నారు. ఏపీకి చట్టంలో ఇచ్చిన హామీల గురించి మర్చిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీని అశాస్త్రీయంగా విభజించారని.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి, పోలవరానికి కేటాయింపులు జరిపారని గుర్తుచేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 94లోనే అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని ఉందని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.