ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రతకు తూట్లు పొడుస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో పెద్ద ఆందోళన నెలకొందన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని నోట్లోంచివచ్చిన మాటలు చంద్రబాబు ఆలోచనలేనని రజిని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవని, నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వలేం కాబట్టి అందరూ ఆయుష్మాన్భారతి కార్డులు తీసుకోవాలని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మనసులో ఉన్న మాటలను తన మంత్రుల ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఆరోగ్యరంగం తమకు అంత ప్రాధాన్యత ఉన్న రంగం కాదని... ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు.