వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోం మంత్రి అనిత చేసిన ఆరోపణలు అబద్ధమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో మిస్సింగ్ కేసులపై పవన్, అనిత చేసిన వ్యాఖ్యల్ని పచ్చి అబద్ధమని కేంద్ర హోంశాఖ తేల్చింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రశ్నల వల్లనే ఆ విషయం బయటపడింది. వైయస్ జగన్ పాలనలో వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, వాళ్లందరినీ గుర్తించి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉందంటూ ప్రకటనలు చేశారు. అయితే.. వైయస్ జగన్ ప్రభుత్వంపై ఈ ఇద్దరి ఆరోపణలు అబద్ధమని కేంద్ర హోం శాఖ తేల్చింది. ఏపీలో పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసుల పై లోక్ సభలో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయ, బీకే పార్థసారథిలు ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మొత్తం ఐదేళ్లలో అదృశ్యమైన వాళ్లలో కేవలం 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు స్పష్టం చేశారు.