రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆగస్టు నుంచి నవంబరు వరకు అవసరమైన ఖర్చుల అంచనాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. ఈ 4నెలలకు గాను మొత్తం రూ.1,29,972కోట్ల వ్యయం అంచనాలతో ఆర్డినెన్సు జారీ చేశారు. ప్రభుత్వం కొత్తగా రావడం.. గత సర్కారు చేసిన అప్పులు వలన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో.. ఆర్థిక అరాచకాల వల్ల వాటిల్లిన నష్టాలపై ఒక స్పష్టతకు వచ్చాకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినట్లు ఆర్డినెన్స్‌లో సర్కారు పేర్కొంది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆర్థిక అరాచకాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూలై వరకు జారీ చేసిన పాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగిసిపోతుండడంతో చంద్రబాబు ప్రభుత్వం మరో 4 నెలల బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబరు 30వ తేదీ వరకు అంచనా వేసిన వ్యయం రూ.1,29,972.97 కోట్లకు గవర్నర్ ఆమోదం తీసుకుంది.