ఉన్నత విద్యలో కొత్త ట్రెండ్ మొదలైంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు తొలిసారి డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. సాంకేతిక కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ అనుమతులు ఇవ్వడంతో ఈ ఏడాది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్(బీబీఏ) కోర్సులను ప్రవేశపెట్టాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించడంతో పాటు తాజాగా ఆ కోర్సులకు ఫీజులు ఖరారు చేసింది. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సులకు కనీస ఫీజు రూ.18వేలు కాగా, గరిష్ఠ ఫీజు రూ.30వేలు. మొదటిసారి కావడంతో కనీస ఫీజు పెట్టాలని ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ సిఫారసు చేసింది. ఫీజులు సవరించాలని ప్రభుత్వం ప్రయత్నించినా కమిషన్ అంగీకరించలేదని తెలిసింది. దీంతో కనీస ఫీజు రూ.18 వేలుగా ఖరారు చేశారు. రెండు కోర్సులకూ ఇదే ఫీజు వర్తించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. వాస్తవానికి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ కోర్సులకు ఫీజుల ఖరారులో జాప్యంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.