ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత ఇసుకపై ప్రజలకు అవగాహన కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2024, 07:10 PM

ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది? గతంలో కన్నా ఇప్పుడే ధరలు పెరిగాయన్న విమర్శలు, ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? తవ్వకం, రవాణా చార్జీలు ప్రభుత్వం తీసుకుంటుందా? ప్రజలు అలాగే భావిస్తున్నారా? ఈ సమస్య పరిష్కారంపై మీరు ఏ ఆలోచనలతో వచ్చారు?’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు... గనుల శాఖ అధికారులను ప్రశ్నించారు. చంద్రబాబు బుధవారం గనులశాఖపై సమీక్ష జరిపారు. ఇసుక తవ్వకం, రవాణా చార్జీల రూపంలో ప్రజలపై భారం పడకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలతో కూడా మాట్లాడి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుకపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంకా మేలైన చర్యలకోసం వారితో మాట్లాడాలని సీఎం నిర్దేశించారు. ఇసుక ఇస్తున్నందుకు ప్రభుత్వం ఎలాంటి ఫీజులు వసూలుచేయడం లేదు. అయినా, ఇసుక తవ్వినందుకు లేబర్‌ చార్జీలు, రీచ్‌ నుంచి డిపోకు, అక్కడి నుంచి వినియోగదారునికి చేరడానికి రవాణా చార్జీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కంటే ఎక్కువగా ధరలు వసూలు చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. సమీక్షలో ఈ అంశాలనే ప్రస్తావించి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని అధికారులను ప్రశ్నించారు. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో....’’ మీరు కూడా రొటీన్‌గా వస్తే ఎలా? అధ్యయనం చేసి పరిష్కారం కనిపెట్టండి’’ అని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. తవ్వకం చార్జీలు అన్ని రీచ్‌ల్లో ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని బాబు సూచించారు. రవాణా చార్జీల విషయంలో ఏకరీతి విధానం తీసుకురాలేమా? అని ఆయన ప్రశ్నించారు. రవాణా భారం తగ్గించే విషయంలో అధికారులు ప్రజలతో మాట్లాడి వారి సూచనలు, సలహాలను తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలాఉంటే , పట్టా భూముల్లో ఉన్న ఇసుకకు సీనరేజీ కట్టించుకొని అమ్ముకునే అవకాశం కల్పించాలన్న అధికారుల ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com