విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా ఉంది కేంద్రం తీరు. 6 వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ఇక ముడిపదార్థాలు నిండుకున్నాయని, కొనేందుకు చిల్లిగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమే అంటూ యాజమాన్యం చేతులెత్తేస్తుంటే… మోడీ గారికి కనీసం చీమ కుట్టినట్లైనా లేదు. పోనీ అప్పు తెద్దామా అంటే గ్యారెంటీకి కూడా కనికరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోడీ .. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారు. లేదు లేదు అంటూనే ఆయన దోస్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. కుక్కను చంపాలి అంటే పిచ్చి దానిగా చిత్రీకరించినట్లు.. విశాఖ స్టీల్ కు రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారు. నిధులు ఇవ్వకుండా సైలెంట్ గా నిర్వీర్యం చేస్తున్నారు. త్వరలోనే అదానీ,అంబానీ,జిందాల్ లాంటి వాళ్లకు కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఏపీ బీజేపీ నేతలను, కూటమిలో భాగస్వామ్యం అయిన టీడీపీ,జనసేన పార్టీలను హెచ్చరిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేకుంటే.. ప్లాంట్ బలోపేతంపై మీకు చిత్తశుద్ధి ఉంటే.. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటన చేయాలి. కావాల్సిన ముడిపదార్థాలు వెంటనే సమకూర్చాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్ కు పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.