గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది.. అంటూ అప్పట్లో అక్కినేని సినిమా మూగమనసులో ఓ పాట ఉంటుంది. మరి ఆ పాటను చూసి ఈ చెట్టును పెట్టారో.. లేదా ఈ నిద్రగన్నేరు చెట్టును స్ఫూర్తిగా తీసుకుని రచయిత ఆ పాట రాశారో తెల్వదు కానీ.. సినిమా చెట్టుగా ఫేమస్ అయిన ఓ మహా వృక్షం కూలిపోయింది. 150 ఏళ్ల జీవిత కాలంలో 300లకు పైగా సినిమాలలో కనిపించి.. హీరో హీరోయిన్ల రొమాన్సుకు, బావా మరదళ్ల సరసానికి, తాతా మనవరాళ్ల ఆప్యాయతకు, డైరెక్టర్ క్రియేటివిటీకి, కెమెరామన్ పనితనానికి సాక్షిగా నిలిచిన ఆ సినిమా చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు ఉన్న షాట్ ఒక్కటి పడితే చాలు సినిమా హిట్ అని నిర్మాతలు నమ్మే స్థాయికి ఎదిగిందీ ఈ సినిమా చెట్టు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే ఈ నిద్రగన్నేరు చెట్టు ఆదివారం రాత్రి కూలిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు.
గోదావరి నది గట్టున ఉన్న ఈ సినిమా చెట్టు కథను చెప్పాలంటే.. మరో సినిమా తీయొచ్చేమో. సింగలూరి తాతబ్బాయి అనే వ్యక్తి ఈ చెట్టును సుమారుగా 150 ఏళ్ల కింద నాటినట్లు స్థానికులు చెప్తుంటారు. ఈ 150 ఏళ్ల కాలంలో సుమారుగా 300లకు పైగా సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. పాడిపంటలు సినిమా నుంచి ఇంకా రిలీజ్ కాని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా వరకు ఈ సినిమా చెట్టు ఓ ఐకాన్ సింబల్. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు, ఆపద్బాందవుడు, నువ్వు లేక నేను లేను, రంగస్థలం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కనిపించిందీ ఈ సినిమా చెట్టు.
సినిమా చెట్టు ఇక లేదు.. నేలకూలిన మహా వృక్షం
దాసరి, విశ్వనాథ్, బాపు, కృష్ణవంశీ, వంశీ , సుకుమార్ ఇలా అనేక మంది ప్రముఖ డైరెక్టర్లు ఈ చెట్టు వద్ద తమ సినిమా షూటింగ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరకూ ఎందరో హీరోల సినిమాల్లో ఈ చెట్టు కూడా భాగం అయ్యింది. అయితే అంతటి పేరున్న సినిమా చెట్టు ఆదివారం రాత్రి కూలిపోయింది. దీంతో కుమారదేవం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందల ఏళ్లనాటి ఈ సినిమా చెట్టు కారణంగానే తమ ఊరికి, ఈ చుట్టు ప్రక్కల ప్రాంతానికి పేరు వచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలా తమ ప్రాంతానికే పేరు తెచ్చిన మహా వృక్షం.. నేలకొరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. అయితే వందల ఏళ్లనాటి చెట్టు కావటంతోనే కూలిపోయిందని.. దీంతో ఈ ప్రాంతానికే అందం పోయిందని అభిప్రాయపడుతున్నారు.