కోడి గుడ్డు ధర కొండెక్కింది. దీంతో సామాన్యులు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బహిరంగ మార్కెట్లో కూరగాయలు ధరలు మండిపోతుంటే కోడి గుడ్ల ధరలు సైతం అందనంత ఎత్తుకు చేరుకున్నాయని ప్రజలు వాపోతున్నారు. గత ఏప్రిల్‌లో రూ.4 నుండి రూ.4.50 వరకు పలికిన కోడ్డి గుడ్ల ధరలు, మే నెలలో రూ.5, 5.50కు చేరాయి. ఇక జూన్, జూలై నెలల్లో అంతకంతకూ పెరుగుతూ కొద్ది రోజుల్లోనే రూ.6.00, రూ.6.50కు చేరుకోవడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మారుమూల పల్లెల్లో చిల్లరగా అయితే కోడి గుడ్లు రూ.7.50 వరకు విక్రయిస్తున్నట్లు గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. ఎంతో కాలంగా చికెన్, మటన్ ధరలు మండుతుండటంతో, పలువురు మాంసాహారులు కోడి గుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కోడి గుడ్ల ధరలు కూడా అమాంతం పెరగడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.