కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది తరలివస్తుంటారు. వివిధ రకాల సేవలు, దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో గోల్ మాల్ వ్యవహారం బయటపడింది. శ్రీవాణి టికెట్లలో కొంతమంది గోల్ మాల్ చేసినట్లు టీటీడీ గుర్తించింది. 545 మంది యూజర్ల ద్వారా.. దాదాపుగా 14,449 అనుమానిత శ్రీవాణి టికెట్ల లావాదేవీలు జరిగినట్లు తనిఖీల్లో టీటీడీ గుర్తించింది. అలాంటి యూజర్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. అలాగే వారికీ మెసేజ్‌లను పంపినట్లు తెలిపింది. ఇదికాకుండా కొంతమంది బుక్ చేసిన 225 శ్రీవాణి టికెట్లపైనా టీటీడీ దృష్టి సారించింది. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చిన సందర్భంలో టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దంటూ టీటీడీ శ్రీవారి భక్తులను కోరింది. శ్రీవారి దర్శనంతో పాటుగా, వసతి, సేవలు బుకింగ్‌లలో నకిలీ ఐడీల ద్వారా దర్శనానికి వచ్చే యాత్రికులను టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ కారణంగా శ్రీవారి భక్తులు మధ్యవర్తుల ద్వారా కాకుండా.. ఆన్ లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరింది. శ్రీవారి దర్శనం టికెట్లు, ఇతర సేవల ఆన్ లైన్ బుకింగ్‌లో అవకతవకలు పాల్పడేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
ఆగస్టు 7న తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం
మరోవైపు తిరుమలలో బుధవారం (ఆగస్ట్ 7) ఆండాల్ అమ్మవారి తిరువడిపురం శాత్తుమొర సందర్భంగా పురుశైవారితోట ఉత్సవం నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పురుశైవారితోటకు వేంచేస్తారు. అక్కడ నివేదనల అనంతరం.. పొగడ చెట్టు వద్దకు రాగానే స్వామివార్లకు హారతి సమర్పిస్తారు. అనంతరం హారతి, పుష్ప మాల, శ్రీ శఠారిని పొగడ చెట్టుకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం తర్వాత తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అనంతరం స్వామివార్లను మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు.