కర్నూలు జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు ఆదివారం రాత్రి భారీ గండి పడింది. దీంతో వంద ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయి. వెల్దుర్తి మండలంలోని 58వ కిలోమీటరు వద్ద శెట్టిపల్లి (మల్లేపల్లి పంప్‌హౌస్) వద్ద హంద్రీనీవా కాలువకు గండిపడింది. సమాచారం అందుకున్న అధికారులు మల్యాలవద్ద ఆరు పంపుల ద్వారా ఎత్తిపోస్తున్న నీటిని ఒక్కసారిగా నిలిపివేశారు. గండి ప్రాంతాన్ని పరిశీలించి పూడ్చివేత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గుండ్లకమ్మపై నిమ్మల, గొట్టిపాటి సమీక్ష: ప్రకాశం జిల్లా వరదాయని గుండ్లకమ్మ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. త్వరలోనే ప్రాజెక్టుకు గేట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు మంత్రులకు వివరించారు.