ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
ఇవాళ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 55.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
మరోవైపు కృష్ణానది వరద ప్రవాహం స్వల్పంగా పెరుగడంతో వివిధ ప్రాజెక్టుల్లో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని హెచ్చరించారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువలను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతలకు తరలించాలని సూచనలు చేశారు. అత్యవసర సహాయం కోసం 1070, 112 మరియు 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని..దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలను ఆనుకుని ఉన్న జిల్లాలతో పాటు, ఖమ్మం వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. మంగళవారం ఖమ్మం జిల్లాలోని గుబ్బగుర్తి లో అత్యధికంగా 14.8 సె.మీ వర్షపాతం నమోదైంది.