వైసీపీ హయాంలో తీవ్ర స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నెల్లూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార ప్రత్యేక వేదికలో ప్రజల నుంచి చాలా వినతులు వస్తున్నట్లు చెప్పారు. తమ దృష్టికి వస్తున్న సమస్యలను కొన్నింటిని పరిష్కరించినట్లు చెప్పారు."సమస్యల పరిష్కార ప్రత్యేక వేదికలో చాలా మంది వినతులతో వస్తున్నారు. మా దృష్టికి వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నాం. మరికొన్ని విచారణకి పంపుతున్నాం. కొన్ని స్థానికంగా పరిష్కరించగలిగే సమస్యలు వస్తున్నాయి. మరికొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. మాది ప్రజాపాలన. సీఎం చంద్రబాబు ఆదేశాలని తూ.చా. తప్పకుండా పాటిస్తాం. వినతి పత్రాలు తీసుకోవడంతోపాటు, వాటిని పరిష్కరించడమే ప్రజా పరిష్కార వేదిక లక్ష్యం. జిల్లా అధికారులందరూ ఒకే దగ్గర ఉండడంతో సమస్యల పరిష్కారం సులువవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న లేఅవుట్ ఇళ్ల నిర్మాణంపై అనేక వినతులు వస్తున్నాయి. జగనన్న లేఔట్ల సమస్యలపై విచారణ జరిపి పరిష్కారం చూపుతాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టం. వైసీపీ హయాంలో తీవ్రంగా ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఎంతటి వారిపైనైనా విచారిస్తాం. తణుకులో టీడీఆర్ బాండ్లలో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. ఈ అక్రమాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే విచారణ కమిటీ వేశాం. నివేదిక కూడా వచ్చింది. సీఎంతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాం" అని నారాయణ పేర్కొన్నారు.