ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతలు దిమ్మతిరిగే షాకులిస్తున్నారు. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీలు రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరిపోతున్నారు. ఇంకొందరు రాజీనామా చేసి కండువా కప్పుకోవడానికి మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు మాజీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేసి బాంబ్ పేల్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా్లో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి కూడా ఆళ్ల రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాని పంపారు. అయితే.. గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నాని అసంతృప్తిగా ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై నాని గానీ.. ఆయన ప్రధాన అనుచరులు, ద్వితియ శ్రేణి నేతలు ఎక్కడా స్పందించం లేదు. రాజీనామాను వైసీపీ హైకమాండ్ అంగీకరిస్తుందా లేకుంటే తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించి వైఎస్ జగన్ బుజ్జగిస్తారా..? అనేది తెలియట్లేదు.