అమలాపురంలో లభించే కొబ్బరి, ఆక్వాముడి ఉత్పత్తులను విలువ ఆధారితంగా మార్చే రంగంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం స్థానిక యువతను సుదూర ప్రాంతాలకు పంపించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ విధంగా కాకుండా స్థానికంగానే ఉపాధి కల్పించాలన్నారు. అవసరమైతే విలువ ఆధారిత రంగాల్లో నైపుణ్యత పెంపొందించే దిశగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ అందించాలన్నారు. మండలాల వారీగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగ యువతను గుర్తించి స్థానికంగా శిక్షణలు ఇస్తూ రాయితీలపై యూనిట్లు మంజూరు చేయాలన్నారు. సంబంధిత నివేదికలను ఈ నెల 22వ తేదీన జరిగే సమావేశం నాటికి సిద్ధం చేయాలని జిల్లా నైపుణ్య కమిటీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి యి.వసంతలక్ష్మి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్, వికాస పథక సంచాలకుడు కె.లచ్చారావు, డీఈవో ఎం.కమలకుమారి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, వికాస మేనేజర్ గోళ్ల రమేష్ పాల్గొన్నారు.