తిరుపతి రుయాస్పత్రిలో డాక్టర్ అని చెప్పి రోగుల సహాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని గురువారం వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ బాలకృష్ణ కథనం మేరకు....సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నరసంపల్లి తాండాకు చెందిన బనావత్ సాయికుమార్ తిరుపతిలో వుంటున్నాడు. నగదు, మొబైల్ ఫోన్లు కొట్టేయడంలో దిట్ట. మదనపల్లెకు చెందిన అశోక్ తన కుమార్తె దీపికను చికిత్స నిమిత్తం ఇటీవల రుయాస్పత్రికి తీసుకొచ్చాడు. బనావత్ సాయికుమార్ తెల్లకోటు వేసుకుని, స్టెతస్కోపుతో డాక్టర్ అని చెప్పి అశోక్‌ను నమ్మించాడు. అతని వద్ద వున్న మొబైల్ ఫోన్ తీసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతా నుంచి రూ 40,000 డ్రా చేశాడు. మోసపోయినట్లు గ్రహించాక అశోక్ తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం తిరుపతి- చెర్లోపల్లి రోడ్డులోని గరుడ సర్కిల్ వద్ద వుండగా సాయికుమార్‌ను అరెస్టు చేసారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోను, రూ 35,000 స్వాధీనం చేసుకున్నారు.