తిరుపతి జిల్లా మదనపల్లెకి చెందిన అశోక్ అనే వ్యక్తి.. తన కుమార్తె కీర్తికకు అనారోగ్యంగా ఉంటే తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెను సర్జికల్ వార్డులో ఉంచారు. అలాగే స్కానింగ్ కోసం రెఫర్ చేశారు. అయితే.. సర్జికల్ వార్డులోకి తెల్ల కోటు, స్టెతస్కోపు వేసుకుని ఓ దొంగ..డాక్టర్ వేషంలో ఎంట్రీ ఇచ్చాడు. రోగులను పలకరిస్తూ కాస్త హంగామా చేశాడు. ఆ తర్వాత కీర్తిక ఉన్న దగ్గరకు వెళ్లాడు. అశోక్ ముందే స్కానింగ్ కోసం ఫోన్ చేసినట్లు నటించాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం ఆధార్ కార్డు అడుగుతున్నారంటూ అశోక్‌ను నమ్మించాడు. దీంతో ఆధార్ కార్డు ఫోన్‌లోనే ఉందని అశోక్ బదులిచ్చాడు.
దీంతో తాను ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వస్తానని.. మీరు స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చేయాలంటూ అశోక్‌కు చెప్పి వెళ్లిపోయాడు. వెళ్తూ, వెళ్తూ.. జిరాక్స్ సెంటర్ వద్ద డబ్బులు చెల్లించేందుకు యూపీఐ పిన్ నంబర్ అశోక్ వద్ద తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత అశోక్ ఫోన్ నుంచి 40 వేలు తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న దొంగ.. ఆ తర్వాత ఫోన్ తీసుకుని చక్కాపోయాడు. అయితే స్కానింగ్ సెంటర్ వద్దకు ఎంతసేపటికీ డాక్టర్ రాకపోవటంతో అనుమానించిన అశోక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గరుడ సర్కిల్ వద్ద దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఈ డాక్టర్ వేషంలో తిరుగుతున్న దొంగ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నరసంపల్లి తండాకు చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. సాయికుమార్ గతంలోనూ ఇదే తరహాలోనే రెండు సెల్ ఫోన్లు కూడా మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. అయితే నిత్యం రోగులతో బిజిబిజీగా ఉండే రుయా ఆస్పత్రిలో ఓ దొంగ ఇలా డాక్టర్ వేషంలో తిరుగుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.