వాతావారణ విధ్వంసం వల్లనే విపరీత పరిణామాలు ఏర్పడుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవులు తమకుతాముగా ఉత్పాతాలను ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులపై పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గాలీ,నీరు,ప్రకృతి విధ్వంసం వల్ల వస్తున్న మార్పులు ఇవని అన్నారు. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. విపరీతమైన చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రివేళలతో పాటు చివరికి మధ్యాహ్న సమయాల్లోనూ చలి వణికిస్తోంది. కనీవినీ ఎరుగని శీతల గాలులతో అమెరికా వణికిపోతోంది. మామూలుగానే శీతాకాలంలో చల్లగా ఉండే దేశం ఈసారి గడ్డకట్టుకుపోతోంది. పోలార్ వొర్టెక్స్ ప్రభావం కారణంగా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులతో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 65 డిగ్రీల ఫారిన్‌హీట్ అంటే మైనస్ 53 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి.
ఎముకలు కొరికేలా ఉన్న చలికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆరుబయట వాతావరణంలో కొద్దిసేపు ఉన్నా పలు రకాల వైకల్యాలు తలెత్తి ప్రాణాల విూదికి వచ్చే (హైపోథెర్మియా) పరిస్థితి ఉంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. రైళ్లు నడవాలన్నా వీల్లేని రీతిలో పట్టాలపై హిమపాతం పేరుకుపోతోంది. కొన్నిచోట్ల బస్సులనే తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా మార్చారు. రికార్డుల్ని తిరగరాసేలా హిమపాతం నమోదు కావచ్చని భావిస్తున్నారు. ఇళ్లు విడిచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. అలాగే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చలి ప్రాణాంతకంగా మారింది. రాష్ట్రంలో పలుచోట్ల చలి పులి ఇంకా పంజా విసురుతూనే ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. శీతల గాలుల విజృంభణ కారణంగా ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి అత్యంత బలంగా వీస్తున్న చలిగాలులు తెలంగాణను ఇప్పటికీ విపరీత రీతిలో గడగడలాడిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో అనేకచోట్ల కురుస్తున్న పొగమంచు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా జనవరి నెలాఖరు నాటికి చలి తీవ్రత తగ్గి ఎండలు మొదలవుతాయి. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు, విపరీతమైన చలిగాలులతో బెంబేలెత్తుతున్నారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చలిగాలుల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కశ్మీరు లోయలో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి తాగునీరు గడ్డకట్టడం మామూలే. ఈసారి పంజాబ్, హరియాణా రాష్టాల్లోన్రూ ఈ పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా ప్రజలు తాగునీరు దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర భారతంలో చలిగాలుల తీవ్రత కారణంగా జనజీవనం అస్తవ్యస్త మయింది. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో ఏకంగా మైదాన ప్రాంతాల్లోనూ మంచు కురిసింది. కొండ ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీమంచుతో గడ్డ కట్టాయి. ఇక్కడ మధ్యాహ్నం వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉత్తరాది స్థాయిలో కానప్పటికీ దక్షిణ భారతంలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. విపరీతమైన చలిగాలులతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదంతా ప్రకృతి విధ్వంసానికి మనం అనుభవిస్తున్న పరిస్థితులకు అద్దం పడుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. విపరీతమైన ప్లాస్టిక్ వినయోగం, కొండలుగుట్టలను ధ్వసం చేయడం, అడవులను నరికివేయడం, కాలుష్యాన్‌ఇన పెంచడం వల్లనే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. విచ్చలవిడి పర్యావరణ విధ్వంసం విపరీతమైన చలిగాలులకు కారణమవుతోంది. అడవుల నరికివేత, అడ్డూఆపూ లేకుండా ఇంధన ఉత్పత్తుల వినియోగం, కాలుష్యం… వాతావరణంలో తీవ్ర మార్పులకు దారితీస్తోంది. ఫలితంగా తీవ్రమైన ఎండలతో పాటు భరించలేని చలిగాలులూ ఏర్పడుతున్నాయని అన్నారు. దీనిని అరికట్టే చర్యలకు పూనుకోకుంటే ఇంతకు రెట్టింతలు నష్టాలను చూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa