అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు సాధిస్తానని రైతులకు ఎంపీ పుట్టా మహేశ్ భరోసానిచ్చారు. రైతులు అదనంగా పండించిన పొగాకుపై ఎంపీ చొరవతో పెనాల్టీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నేపధ్యంలో పొగాకు రైతులు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌ను ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సత్కరించారు. పొగాకు రైతు సంఘాల అధ్యక్షుడు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి, కాకర్ల వివేకానంద్ తదితరులు మాట్లాడుతూ ఎంపీ కృషి ఫలితంగా జిల్లాలో 15వేల మంది పొగాకు రైతులు రూ.15 కోట్లు, రాష్ట్రంలో లక్ష మంది పొగాకు రైతులు 110కోట్లు లబ్ధిపొందారని చె ప్పారు. ఎంపీ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి, వేగంగా పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. త్వరలో కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12వేల కోట్లు మంజూరు కానున్నాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌లో ఏలూరులో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, పొగాకు రైతు నాయకులు సత్రం వెంకట్రావు, కె.శేషుబాబు, ఇల్లూరి రాంబాబు, శ్రీనివాసరావు, వామిశెట్టి హరిబాబు, కూచిపూడి రమేష్, వీవీఎస్.ప్రకాశరావు, అట్లూరి సతీష్, తదితరులు పాల్గొన్నారు.