వైసీపీ పాలనలో భూదందాలు, అక్రమాల నిగ్గు తేల్చేందుకు, భూ సమస్యల పరిష్కారానికి ఈనెల 16 నుంచి సెప్టెంబరు 30వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 15 జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఏలూరి ఆదివారం ప్రకటనలో తెలిపారు. గ్రామాలవారీగా భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతాంగ సమస్యలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. ఐదేళ్ల పాలనలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. అనేక మంది సామాన్య మధ్యతరగతి ప్రజలను బెదిరించి భూములను స్వాధీనం చేసుకున్నారని దీనిపై అనేక ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఆధికార యంత్రాంగం ప్రజల చెంతకు వెళ్లనున్న ట్లు ఆయన ఈసందర్భంగా తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో అక్కడికక్కడే సమస్యలను తెలుసుకునేలా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసిందన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు మరో 45 రోజల గడువు ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తహసీల్దార్‌తో పాటు, ఆయా భూముల వ్యవహారాలతో సంబంధం ఉన్న ఆటవీ, దేవదాయ ఇతర శాఖ ల అధికారులు సైతం ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. సదస్సులో వచ్చిన ప్రతి అర్జీని అన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించిందన్నారు. వైసీపీ హయాంలో నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీహోల్డ్ పేరుతో తప్పించిన భూముల రిజిస్ట్రేషన్‌లపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందన్నారు. అసైన్డ్, చుక్కల భూములు, ఫరతులున్న వేల ఎకరాల భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించి వైసీపీ నేతలు రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు రైతుల పొలాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని ఏలూరి కోరారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఏలూరి తెలిపారు. 16 నుంచి వచ్చేనెల 30 వరకు గ్రామాలవారీగా సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. ఈసదస్సులో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.