జిమ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న అమీన్ ఆరీ్‌ఫ(18)పై హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చీరాల పట్టణ, రూరల్ పరిధిలోని పలువురు ముస్లిం మైనార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈనెల 6వ తేదీన ఆరీఫ్ హత్యతో ఆందోళన నెలకొంది. దీనిపై ఇప్పటికే ఒకసారి పలు సంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ పట్టణంలో రోడ్డుపై బైఠాయించారు. ఇదిలావుండగా తిరిగి ఆదివారం రాత్రి ఈపూరుపాలెం స్ట్రయిట్ కట్ కాలువ వద్ద పెద్ద ఎత్తున చేరుకుని వాహనాలను నిలిపి వేసి ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ చీరాల్లో గంజాయి, మద్యం వంటి అసాంఘిక కలాపాలు జోరుగా సాగుతున్నాయన్నారు. కోడి పందేలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఆరీఫ్, సుచరిత, లలితమ్మ హత్యలు జరిగినట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసుల నిఘా పెంచాలన్నారు. ఆరీఫ్ కేసులోని ఇన్వెస్టిగేషన్ అధికారిని మార్చాలని డిమాండ్ చేశారు. కోడి పందేలు అరికట్టినట్లయితే ఆరీఫ్ కోడి కత్తితో మృతి చెందాల్సి ఉండేది కాదన్నారు అసాంఘిక శక్తులకు కొందరు పోలీసుల సహకారం ఉందని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు కచ్చితంగా కృషి చేస్తామని సర్ది చెప్పారు.కాగా.... ఆరీ్‌ఫను హతమార్చిన హంతకులలో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. అలాగే కేసులో మరో వ్యక్తి కోసం గాలింపు సాగిస్తున్నారు. నేడో రేపో హంతకులను అధికారికంగా అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో ఆరు బృందాలు పనిచేస్తున్నట్లు సమాచారం.