తిరుపతి జిల్లాలో ఈనెల 20 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే 18-19 సంవత్సరాల యువతను కొత్త ఓటరుగా నమోదుకు భారత ఎన్నికల కమిషన్ అవకాశమిచ్చింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 18వ తేదీ నాటికి సవరణ ప్రక్రియ పూర్తి చేసి, అదేనెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమాచారాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓటర్ల జాబితాల్లో పొరపాట్లను గుర్తించి తొలగించడం, ఫొటోల నాణ్యతను మెరుగుపరచడం, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేయనున్నారు. అక్టోబరు 19 నుంచి 28వ తేదీవరకు 1 నుంచి 8 వరకు ఫారాల తయారీతో పాటు వచ్చే ఏడాది జనవరి ఒకటోతేదీ నాటికి సమగ్రమైన డ్రాఫ్ట్ రోల్స్ సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఇతర క్లెయిమ్‌లు నవంబరు 28వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ ఏడాది డిసెంబరు 24వ తేదీ నాటికి అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది జనవరి 6న ప్రచురించనున్నారు.