అంటువ్యాధులు లేకుండా నిర్మూలిద్దామని తూర్పు గోదావరి కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజనోత్సవంలో భాగంగా తూర్పు గోదావరి కలెక్టరేట్‌లో సోమవారం హెచ్‌ఐవీపై మీకోసం చైతన్యం,డీ వార్మింగ్ డే కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. సోమవారం నుంచి అక్టోబరు 13వ తేదీ వరకు 8 వారాల పాటు హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు 20న డీవార్మింగ్ డేను పురస్కరించుకుని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నభోజన సమయంలో అల్బెండాజోల్ మాత్రలు వేసుకునేలా చూడాలన్నారు. ఈ రెండు కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ఈ నెల 28న మరోసారి మిగిలిన పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ళ వయస్సు కలిగిన వారు 4,30,339 మంది ఉన్నట్టు తెలిపారు. హెచ్‌ఐవీ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికి జిల్లాలో కేసుల నమోదు ఎక్కువగా ఉందన్నారు. దేశంలో 2030 నాటికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ , ఇతర అంటువ్యాదులను అంతం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు. 1097 హెచ్‌ఐవీ హెల్ప్‌లైన్ నెంబర్ అన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి జేసీ జి.నరసింహులు, డీఎంహెచ్‌వో కే.వెంకటేశ్వరరావు, ఎన్.వసుంధర తదితరులు పాల్గొన్నారు.