ఎన్నికల ఫలితాలపై జూన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రివ్యూ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఏ అంశాలపై వెళ్లాలనేదానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారని తెలిపారు. కులగణన అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ లెవనెత్తిందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదని విమర్శించారు. వక్ఫ్ చట్ట సవరణతో మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా చర్యలు తీసుకుందని వ్యాఖ్యలు చేశారు. సెబీ ఆదాని అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. సెబీని తన గుప్పెట్లో పెట్టుకొని ఆదానిని కాపాడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగవ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. కులగణనపై గ్రామస్థాయిలో పోరాటాలు చేయబోతోందని తెలిపారు. అవినీతిరహిత పాలన అంటూ బీజేపీ గొప్పలు చెబుతోందని.. కానీ ఆదాని - మోడీల అవినీతిని రాహుల్ గాంధీ ఎప్పుడో ఎండగట్టారన్నారు.