ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేసినట్లు రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని మండిపడ్డారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుంచి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని తెలిపారు. రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్దంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.