విశాఖ జిల్లా పెందుర్తిలో ఒక తల్లి దాష్టీకానికి వడికట్టింది. వివరాల్లోకి వెళ్ళితే..... పెందుర్తి అఖిలేశ్వరి ఆస్పత్రి సమీపంలోని అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న బి.స్వాతికి, దీపేందర్‌తో పద మూడేళ్ల కిందట వివాహమయింది. వీరికి పన్నెండేళ్ల కుమార్తె, పదేళ్ల కుమారుడు ఉన్నారు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో నివసించిన సమయంలోనే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈక్రమంలో స్వాతి తన కుమార్తె (12)తో కలసి మూడు నెలల క్రితం పెందుర్తి వచ్చి, ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటోంది. ఈ నెల తొమ్మిదిన శ్రీకాంత్ అనే వ్యక్తిని మళ్లీ వివాహం చేసుకుంది. కుమార్తె ఇంటి పనులు చేయలేదనే కారణంతో తల్లి స్వాతి మంగళవారం రోటీలు తయారీచేసే కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. దెబ్బలకు తాళలేక కొట్టొద్దని వేడుకున్నా కనికరించలేదు. చేతులు, ముఖంపై కొట్టడంతో ఎర్రగా కంది, వాచిపోయాయి. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్న బాలిక పరుగున పెందుర్తి పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. రోదిస్తూ తన తల్లి చేసిన దాడిని వివరించింది. దీంతో పోలీసులు వెంటనే బాలికను వైద్యంకోసం ఆస్పత్రికి తరలించారు. దెబ్బలు గట్టిగా తగలడంతో ఆందోళనలో ఉందని, చికిత్స చేశామని, ప్రసుత్తం బాలిక పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా తల్లి స్వాతిని స్టేషన్‌కు పిలిపించారు. అయితే ఇంటి పనుల్లో సహాయం చేయకపోవడంతో మందలించి, కొట్టానని, ఉద్దేశపూర్వకంగా కాదని తల్లి స్వాతి చెప్పినట్టు సీఐ వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.