యువతలో దేశ భక్తి భావం పెంపొందించేలా పోలీసు కవాతు నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి పోలీసు కవాతు సాధనను ఎస్పీ బుధవారం పరిశీలించారు. పరేడ్ కమాండర్, ఏఆర్‌డీఎస్పీ శేషాద్రి పర్యవేక్షణలో ఆర్మ్‌డ్ పోలీసు సిబ్బంది, పోలీసు బ్యాండ్ సిబ్బంది, స్కౌట్స్ విద్యార్థులు కవాతు నిర్వహించారు. ముందుగా సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.కవాతును సమష్టిగా, సమన్వయంతో నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని సూచించారు. మైదానంలో వాహనాల పార్కింగ్, ట్రాఫిక్, భద్రత, బందోబస్తుపై అధికారులతో ఎస్పీ చర్చించారు. ఈ సాధన కార్యక్రమంలో ఏఎస్పీ డా.జి.ప్రేమ్‌కాజల్, ఆర్‌ఐ కె.నర్శింగరావు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.