ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్‌వోడీ, అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి కొనసాగిస్తున్నారు. తాజాగా హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగించారు.. 2025 జూన్ 26 వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. అయితే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉంటున్న అమరావతి సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. 2017 నుంచి ఈ సౌకర్యాన్ని ఉద్యోగులకు అందిస్తున్నారు. ప్రతి ఏటా ఉద్యోగ సంఘాల నేతల రిక్వెస్ట్‌తో ఈ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నారు.
2022 జూన్ నెలలో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని జీఏడీ (సాధారణ పరిపాలనాశాఖ) ఆదేశించింది. అయితే ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడంతో మళ్లీ ఆ సౌకర్యాన్ని ఏడాది పాటూ పొడిగించారు.. అప్పటి నుంచి వరుసగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు 2017లో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే ఉద్యోగులకు రెండురోజులు వీకాఫ్ ఇచ్చిచన సంగతి తెలిసిందే.. అలాగే ఉద్యోగుల కోసం ప్రతి రోజూ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును నడుపుతున్నారు. కొందరు ఉద్యోగులు రోజూ హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి వెళ్లేవారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. గత రెండు నెలలుగా జీతాలను ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లిస్తోంది. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రభుత్వ టీచర్లను యాప్ బాధ నుంచి తప్పించింది.