వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అవినాష్ గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే శంషాబాద్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నాయని.. విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల్ని కోరారు. ఆ వెంటనే అవినాష్ ప్రయాణాన్ని ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు అడ్డుకోగా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
దేవినేని అవినాష్‌పై తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి కేసులో కూడా అవినాష్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.. ఇప్పటికే పలువురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వందలాదిమంది టీడీపీ కార్యాలయంలోకి చొరబడ్డారు.. అక్కడ వస్తువుల్ని ధ్వంసం చేసి.. టీడీపీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంరేపింది.. టీడీపీ ఫిర్యాదు చేసినా అప్పటి ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై కేసుల్లో విచారణనను ముమ్మరం చేశారు. అప్పటి సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ఆరోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
టీడీపీ కార్యాలయంలో పై దాడి కేసులో దేవినేని అవినాష్ సహా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్‌లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండటంతో.. వీరిపై తొందపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో.. అవినాష్ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించి దొరికిపోయారు.